పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif)కు చెందిన పీఎంఎల్-ఎన్(PML-N) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif))ను నియమిస్తూ పీఎంఎల్-ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆరు పార్టీలు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే, పాక్‌లో తాజాగా ముగిసిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షెహబాజ్ షరీఫ్. పాక్ అధ్యక్షుడిగా జర్దారి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, పంజాబ్ ప్రావిన్స్‌లో నవాజ్ కూతురు మరియం నవాజ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అత్యధిక సీట్లు గెలిచిన పీటీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
పాక్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని, ఇరు పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో పాక్ ప్రధాని పదవి రేసు నుంచి పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో తాజాగా వైదొలిగినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. ‘పీఎంఎల్-ఎన్’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇమ్రాన్ మద్దతుదారులు 92 స్థానాల్లో గెలవగా, పీఎంఎల్- పార్టీ 79, పీపీపీ 54 సీట్లను గెలిచింది.