ఉత్తరాదిని మంచు దుప్పటి (Snow Fall) కప్పేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. ఈ ఏడాది సిమ్లాలో తొలి మంచు(Shimla Snow) కురిసింది. చాలా స్వల్ప స్థాయిలో ఇవాళ ఉదయం సిమ్లా వీధుల్లో మంచు కురిసింది. మంచుదుప్పటిలో ఉన్న సిమ్లాకు పర్యాటకుల తాకిడి పెరిగింది.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఈ మంచు వాన ఊరటనిచ్చిందని అక్కడి రైతులు అంటున్నారు. సిమ్లా రిడ్జ్ వద్ద వేల సంఖ్యలో ప్రజలు స్నోఫాల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సిమ్లాలోని కుర్ఫీ హిల్ స్టేషన్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆ ప్రాంతం అంతా వింటర్ అందాలతో అద్భుతంగా మారింది. హిమాలయాలకు చెందిన ఎగువ ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల్లో తొలిసారి మంచు కురిసింది.
సిమ్లాలో ప్రస్తుతం స్నో ఫాల్ స్వల్ప స్థాయి నుంచి మధ్య స్థాయి వరకు ఉండనుంది. లాహౌల్-స్పిటి, కిన్నౌర్, చంబా, కులు, కంగ్రా, మండి, సిర్మౌర్, షిమ్లా జిల్లాలో గత 24 గంటల నుంచి మంచు కురుస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత కాస్త అధికంగా స్నో కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో గత 24 గంటలుగా మంచు వర్షం పడుతోంది.
మరోవైపు రహదారులు, ఇళ్లు, భవనాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది. సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ భారీగా మంచు కురుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన తెహ్రీ గర్వాల్, ధనౌల్తి, సుర్కందా దేవి కొండలు మంచుతో కప్పబడి కనువిందు చేస్తున్నాయి. ఇక బద్రీనాథ్ ఆలయం కూడా పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది.