షిర్డీ సాయిబాబా(Shirdi Sai Baba) దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో సాయిబాబా భక్తులు సమర్పించిన బంగారం(Gold), వెండి(Silver) కానుకలతో బంగారం, వెండి నాణేలు తయారు చేసి విక్రయించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరామని, అనుమతులు వస్తే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
భక్తులు ఇప్పటి వరకు సమర్పించిన కానుకల్లో 450 కిలోలు బంగారం, 6వేల కిలోల వరకు వెండి హుండీల్లో వచ్చి చేరింది. ఈ క్రమంలో షిర్డీ సాయిబాబా దేవస్థాన ట్రస్ట్ బోర్డు బంగారం, వెండిని కరిగించి పతకాలు, నాణేలను తయారు చేయించి.. వాటిని విక్రయించేందుకు నిర్ణయించింది.
దేశంలోని ప్రముఖ ఆలయాల్లో షిర్డీ సాయిబాబా ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశ నలుమూలల నుంచే కాదు.. విదేశాల నుంచి అనేక మంది భక్తులు బాబా దర్శనానికి శిర్డీ పయనం అవుతారు. దీంతో ఆలయానికి భారీగానే ఆదాయం సమకూరుతుంది. పలువురు భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి కానుకలను సైతం సమర్పిస్తుంటారు.
షిర్డీ దేవస్థానం ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తుల్జాపూర్ భవానీ దేవస్థానం కూడా పరిశీలించి షిర్డీ ట్రస్ట్ సభ్యులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు ట్రస్టు బోర్డులు మాట్లాడుతూ ఆలయానికి 450కిలోల బంగారం, 6వేల వరకు వెండి భక్తులు కానుకలుగా సమర్పించారని వెల్లడించారు. ఇందులో 155 కిలోల బంగారం 6వేల కిలోల వెండిని కరిగించి.. 5, 10 గ్రాముల నాణెలు, పతకాలను తయారు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.