మధ్యప్రదేశ్‌లో ఎన్డీటీవీ (NDTV) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ (Kamal Nath)తో పోలిస్తే ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ (Shivaraj Singh Chouhan) వైపే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. మౌలిక సదుపాయాల కల్ఫన, శాంతి భద్రతల విషయంలో అత్యధికులు బీజేపీ సర్కార్ పట్ల సంతృప్తికరంగా ఉన్నట్టు పేర్కొంది.
రాష్ట్రంలోని 230 నియోజకవర్గాలకు గాను 30 నియోజకవర్గాల్లోని 3000 మందిపై అక్టోబర్‌లో ఎన్డీటీవీ సర్వే నిర్వహించింది. తాజాగా సర్వే వివరాలను ఎన్డీటీవీ విడుదల చేసింది. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం… మధ్యప్రదేశ్‌లో రోడ్లు, విద్యుత్, వైద్య సౌకర్యాలు, మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో ప్రజలు బీజేపీపై సంతృప్తితో ఉన్నారు.
ఈ క్రమంలో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం పట్ల 27 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇక 34 శాతం మంది ప్రభుత్వంపై కొంత వరకు సంతృప్తికరంగా ఉన్నట్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 16 శాతం మంది కొంత వరకు అసంతృప్తిగా, 18 శాతం మంది పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది.
ఇక సీఎంగా పనితీరు విషయంలో శివరాజ్ సింగ్ చౌహన్ కు అనుకూలంగా 36 శాతం మంది, కమల్ నాథ్‌కు అనుకూలంగా 34 మంది సర్వేలో మొగ్గు చూపారు. ఇద్దరు పనితీరు బాగానే ఉందని 18శాతం మంది, వీళ్లిద్దరి పనితీరు సరిగా లేదని మరో కొత్త వ్యక్తిని సీఎం చేయాలని 11 శాతం మంది అభిప్రాయాన్ని వెల్లడించారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చాక రహదారుల పరిస్థితి బాగా మెరుగుపడిందని 55 శాతం, అధ్వాన్నంగా మారిందని 28 శాతం మంది చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని 54, దిగజారిందని 24 శాతం అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు.