రాజకీయాలకు.. సినిమా రంగానికి చాలా దగ్గరి పోలికలున్నాయి.. తెరమీద నటించిన ఎందరో ఇప్పటి వరకు రాజకీయ ప్రవేశం చేశారు.. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు అలా కొనసాగుతున్నారు.. ఇలా రాజకీయాల్లో నటులే కాకుండా నటీమణులు సైతం పదవులు చేపట్టారు.. ఈ క్రమంలో తాజాగా మరో సీనియర్ నటి రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
నటి శోభన (Shobana) గురించి తెలియని వారుండరు.. తెలుగు, తమిళ , మళయాళ సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆమె నాటి తరం హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక శోభన నటన గురించి కానీ, ఆమె నృత్యం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన ఈ కళాకారిణి.. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ (Political Entry) ఇస్తున్నారు..
ఈమేరకు కేరళ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.. తిరువనంతపురం (Thiruvananthapuram) లోక్‌సభ స్థానానికి ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేరళ (Kerala)లో ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న బీజేపీ (BJP) కార్యక్రమంలో ప్రధాని మోడీ (Modi) పాల్గొననున్నారు.. ఆ రోజున తొలి జాబితాను బీజేపీ విడుదల చేయనున్నదని తెలుస్తోంది.
మరోవైపు తిరువనంతపురం నియోజకవర్గం ఎంపీ శశిథరూర్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ అధిష్టానం శోభనను రంగంలోకి దించే అవకాశాలున్నట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఇదే స్థానం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు సురేశ్ కుమార్ సైతం బీజేపీ నుంచి పోటీ పడే ఛాన్సు ఉందని టాక్ వినిపిస్తోంది. కానీ నటి శోభనకే ఆ స్థానం నుంచి సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.