ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర (Shobayatra) మొదలైంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణనాధుడు (Khairathabad Ganesh) ఉదయం11 గంటలకు క్రేన్ నెంబర్ 4 కి చేరుకోనున్నాడు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తికానుంది. ఇక ఆ తరువాత మిగతా వినాయకుల నిమజ్జన కార్యక్రమం జరగనుంది. శోభాయత్రతో హైదరాబాద్ (Hyderabad) వీధులన్ని సందడితో నిండిపోయాయి.
గతంలో అయితే జంట నగరాల్లోని వినాయక నిమజ్జనం ముగిశాక చివరిలో ఖౌరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉండేది. చివరిలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పెట్టుకుంటే ఇబ్బంది తలెత్తుతోందని ఈ ఏడాది ముందుగానే నిర్వహిస్తున్నారు. కాగా.. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో బ్యాండ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు సైతం ప్రారంభమైంది.
శోభాయాత్రకు 40 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే 20 వేల సీసీ కెమెరాలు నిరంతరం సిటీలోని అన్ని ప్రదేశాలనూ కవర్ చేస్తున్నాయి. గణేశ్ ఉత్సవ సమితి, జలమండలి ఎక్కడికక్కడ ఆహారం, నీళ్ల ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేక ప్లాన్స్ అమలు చేస్తున్నారు.
నిమజ్జనం సందర్భంగా ఇవాళ రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. అలాగే ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా నగరంలోకి లారీలను ఎల్లుండి వరకు అనుమతి ఇవ్వలేదు. మరో వైపు శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు ఇవాళ సెలవు ప్రకటించింది.