ప్రతిపక్ష ఇండియా కూటమి (India Alliance)లో కాంగ్రెస్(Congress)కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్పష్టం చేసింది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో తాము స్వతంత్రంగా పోటీ చేస్తామని ఆప్ వెల్లడించింది.
పంజాబ్‌లో ఆప్ నేతలతో సీఎం భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ….. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లోనూ ఆప్ తన అభ్యర్థులను నిలబెడుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో పోటీ కోసం 40 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. ఆ జాబితాపై సర్వే నిర్వహించి ప్రజలు మెచ్చిన అభ్యర్థులతో తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న మమతా బెనర్జీ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరిస్తుందా అని మీడియా అడిగి ప్రశ్నకు సమాధాన మిస్తూ…. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో తమకు ఎలాంటి పొత్తూ ఉండదని తెలిపారు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలన్న ఆప్ పంజాబ్ యూనిట్ చేసిన ప్రతిపాదనలకు అరవింద్ కేజ్రీవాల్ ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. పంజాబ్ లో పొత్తు విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ హై కమాండ్ మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే భగవంత్ సింగ్ మాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.