Telugu News » మీ చావు మీరు చావండి.. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ గాలికేనా?

మీ చావు మీరు చావండి.. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ గాలికేనా?

by admin
telangana food safty

హైద‌రాబాద్ వాసులు ఎంత‌టి భోజ‌న ప్రియులో.. జొమాటో, స్విగ్గీ లెక్క‌లే చెబుతున్నాయి. పోటీప‌డి మ‌రీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ అన్ని ర‌కాల వంట‌కాల‌ను లాగించేస్తున్నారు మ‌నోళ్లు. మ‌రీ ముఖ్యంగా బిర్యానీని అయితే.. ఓ ప‌ట్టు ప‌డుతున్నారు. దీంతో న‌గ‌రంలో విచ్చ‌ల‌విడిగా రెస్టారెంట్లు, హోట‌ళ్ల డోర్లు తెరుచుకున్నాయి. ప‌సందైన వంట‌కాలు అంటూ ఆహార ప్రియుల‌కు స‌రికొత్త ఆఫ‌ర్ల‌తో ఆహ్వానం ప‌లుకుతున్నాయి. దీనికితోడు యూట్యూబ‌ర్స్ పుణ్య‌మా అని ఎక్క‌డో మారుమూల ఉండే హోట‌ళ్ల‌కు కూడా క్రేజ్ వ‌చ్చేస్తోంది. ఈగ‌ల తోలుకునే కొంద‌రు ఓన‌ర్లు అయితే డ‌బ్బులు ఇచ్చి మ‌రీ.. త‌మ రెస్టారెంట్లను ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. కేవ‌లం, హైద‌రాబాద్ లోనే కాదు, తెలంగాణ‌లోని ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో కూడా ఫుడ్ క‌ల్చ‌ర్ బాగా పెరిగిపోయింది. మ‌రి, ఆహార భ‌ద్ర‌త‌, నాణ్య‌తా ప్ర‌మాణాల మాటేంటి..?

telangana food safty

2022-2023 సంవ‌త్స‌రానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచ‌ల‌న నివేదిక బ‌య‌ట‌పెట్టింది. ఇందులోని అంశాల‌ను ప‌రిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఆహార భద్రత, నాణ్యతలో తెలంగాణ వాటా, ప్రజారోగ్యాన్ని ప‌రిశీలిస్తే.. జ‌నాన్ని గాలికొదిలేసిన‌ట్టు అర్థం అవుతోంది. నివేదిక‌లోని అంశాల‌ను గ‌మ‌నించిన ఎవ‌రికైనా ఇదే అనిపిస్తుంది. తెలంగాణకు ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో వంద సూచీల్లో మ‌న రాష్ట్రం 32వ స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో లెక్క‌లు తిర‌గేస్తే… తెలంగాణ 14వ స్థానంలో ఉందని ఈ నివేదిక ద్వారా తెలిపింది. ఆహార నాణ్యతలో 6 ముఖ్యమైన సూత్రాలనూ పాటించడంలో విఫలమైనట్టుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర సంస్థల్లో ఆహార భద్రతా స్థాయులు దారుణంగా ఉన్నాయ‌ని అందులో పొందుప‌రిచారు. టెస్టులు జరుగుతున్నా నామమాత్రమేన‌ట‌. ఏదో, తూతూ మంత్రంగానే ఇవి సాగుతున్నాయి. జడ్జీల కేటగిరీ విషయం ఇలా ఉంటే కన్స్యూమర్ ఎంపవర్ మెంట్ కేటగిరీ కూడా ఇలాగే ఉంది. ఆహారం నాసిరకంగా ఉందనో, ఇతరత్రా కార‌ణాల‌తో వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ సమస్యకు సత్వర పరిష్కారం కావ‌డం లేదు. ల్యాబ్ లు తగినన్ని లేకపోవడం, నిపుణుల కొరత ఉన్న‌ట్టు తేలింది. ఆహార శాంపిల్స్ సేకరించి దాన్ని సకాలంలో లేబొరేటరీలకు పంపే సిస్టం సవ్యంగా లేదు. ఈ విషయంలో తెలంగాణ 44వ స్థానంలో ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది.

తెలంగాణ‌లో ప్రజలు తింటున్న ఆహారం నాణ్యమైనదా కాదా అని తేల్చే దిక్కే లేద‌ట‌. టెస్టులు జరుపుతోంది త‌క్కువే. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆహార సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నా.. ఫుడ్ క్వాలిటీని ప్ట‌టించుకునే, పరీక్షించే నాథుడే క‌రువ‌య్యాడు. ప్రభుత్వం రాత్రుళ్ళు కూడా పని చేసే ఈటరీలను ప్రోత్సహిస్తున్నా వాటిలో పని చేస్తున్నవారు చేతులకు గ్లోవ్స్, తలలకు హెడ్ కవర్స్ ధరిస్తున్నారా లేదా అని గానీ, నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారా అని పరిశీలించే వ్యవస్థ గానీ లేదనేది నిపుణుల మాట‌. ప్యాకేజీ చేసిన ఫుడ్ ప్యాకెట్లలో హానికరమైన ఇంగ్రెడియంట్లు ఉన్నాయా అని తేల్చే ప్రక్రియ కూడా అసలు లేదంటున్నారు. హైదరాబాద్ స‌హా మరో 4 జిల్లాల్లోనూ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ అనే వ్యవస్థను తెచ్చారు. 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను లాంచ్ చేశారు. ఆహారంలో కల్తీ జరిగిందా, ఫుడ్ నాణ్యమైనదా కాదా అన్నదాన్ని ఈ ల్యాబ్ లు టెస్ట్ చేసి నిర్ధారిస్తాయి. కానీ, వీటి పని తీరు ఏమంత సంతృప్తికరంగా లేదనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ, ఈ వ్యాఖ్యల‌ను అధికారులు కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ విషయానికి వస్తే పర్ఫామెన్స్ బలహీనంగానే ఉంది.

You may also like

Leave a Comment