జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కేంద్రం.. భద్రతా బలగాలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. దీంతో జమ్మూకశ్మీరులో తరచూ ఎదురు కాల్పులు జరగడం కనిపిస్తుంది. కాగా పాకిస్థాన్ నుంచి సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులు అక్రమంగా చొరబడేందుకు ఇటీవల చేసిన యత్నాలను బీఎస్ఎఫ్ బలగాలు తిప్పికొట్టాయి.
మరోవైపు ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్ర భద్రతా బలగాలు నిరంతరం వారి కోసం గాలింపును ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ షోపియాన్‌లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. గురువారం తెల్లవారుజామున షోపియాన్‌లోని కతోహలెన్ (Kathohalen) ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా మరణించిన ఉగ్రవాది.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉగ్రసంస్థకు చెందినట్టు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఇక ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి.
మరోవైపు రామ్‌గఢ్ సెక్టార్ (Ramgarh sector) అంతర్జాతీయ సరిహద్దుల వెంట జరిగిన కాల్పుల్లో ఓ (BSF) జవాన్ గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ (Pakistan) సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ ఘాతుకానికి తెగబడిందని భద్రతా దళానికి చెందిన అధికారులు తెలిపారు.