తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల (Rajashyamala)సహిత సుబ్రమణ్యేశ్వరస్వామి (Subramaniaswara Swamy) యాగం (Yagam) ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు విశాఖ శ్రీ శారదా పీఠం వైదిక నియమాలను అనుసరిస్తూ ఈ యాగం జరిగింది. ఈరోజు అనగా శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది.
కాగా రాజశ్యామల అమ్మవారు యాగశాలలో నర్తనకాళి అలంకరణలో దర్శనమిచ్చారు. మరోవైపు మహా పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొని ఆశీర్వచనాలు పొందారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర, స్వరూపానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు చేసారు.
రాజశ్యామల అమ్మవారు తెలంగాణ ప్రజలందరిని అనుగ్రహించాలని కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించినట్లు శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందని అన్నారు. మరోవైపు మహా పూర్ణాహుతి అనంతరం యాగ భస్మాన్ని కేసీఆర్ నుదుట దిద్ది.. మంత్రించిన జలాలను కేసీఆర్ దంపతులపై చల్లారు పండితులు. కాగా కేసీఆర్ దంపతులు ధరించిన కంకణాలను విసర్జించడం ద్వారా యాగం పూర్తయింది.