పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ (Telangana) సర్కార్ నిర్మించిన 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రారంభించారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా 350కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల తరహాలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్సతో పాటు ప్రాణాంతక వ్యాధులైన కిడ్నీ, క్యాన్సర్, గుండె సంబంధిత వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..తెలంగాణ (Telangana) రావడం వల్ల, కేసీఆర్ సిఎం కావడం వల్లనే పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలో ఎంబీబీస్ సీట్లతో పాటు పీజీ సీట్లను కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతిచ్చిందని, ఈ సీట్ల పెరుగుదలతో ప్రతి సంవత్సరం 175 మంది డాక్టర్లు కొత్తగా ఈ హాస్పిటల్ కు వస్తారని అన్నారు.
గాంధీలో ఎలాంటి వసతులు, వైద్యం అందుతుందో అలాంటి వైద్యం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ఉందన్నారు. అంతేగాకుండా 23 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరు చేశామని,15 కోట్లతో క్యాన్సర్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నామని, 40 బెడ్లతో డయాలసిస్ పేషెంట్లకు చికిత్స, క్యాత్ లాబ్ సైతం ఏర్పాటు చేసి గుండె సంబంధిత వైద్య సేవలు అందిస్తున్నట్టుగా తెలిపారు. ఇదే ఫ్లోర్ లో 15 ఆపరేషన్ థియేటర్స్ అందులో 8 మాడ్యులర్ థియేటర్స్ ఏర్పాటు చేసినట్టు హరీశ్ రావు తెలిపారు.
నాలుగో ఫ్లోర్ లో 100 ఐసీయూ బెడ్స్, 30 ఎమర్జెన్సీ బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. పేదలు, రైతుల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించేలా వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చుకున్నాం అన్నారు. ఒకప్పుడు నీళ్ళు ఎరుగని ప్రాంతాన్ని నేడు కరువు అనేది ఎరుగని ప్రాంతంగా మార్చుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు..