ఈశాన్య రాష్ట్రం సిక్కింలో (Sikkim) కురిసిన భారీ వర్షాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు (Floods) సంభవించి ఎందరివో ప్రాణ జ్యోతులు ఆరిపోయాయి. ప్రకృతి సృష్టించిన యుద్ధంలో గల్లంతైన వారు, అనాధాలుగా మారిన వారు ఎందరో మరెందరో..
ఇక ఇప్పటి వరకు వరదల్లో 14 మంది మృతి చెందగా.. మరో 26 మంది గాయపడినట్టు, 22 మంది జవాన్లు సహా మొత్తం 102 మంది గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. అలా గల్లంతైన వారిలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన అలనాటి నటి సరళా కుమారి (Sarala Kumari) కూడా ఉన్నట్టు సమాచారం. ఇక సరళ కుమారి మిస్ ఆంధ్రప్రదేశ్‌గా 1983లో ఎంపికై తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
దాన వీర శూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన సరళ కుమారి ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) హైటెక్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టు తెలిసింది. అక్టోబరు 2న తన మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్ళిన ఈ నటి ఆక్కడ గల్లంతవడంతో అమెరికాలో (America) ఉంటున్న ఆమె కుమార్తె ఆందోళన చెందుతున్నారు.
దయచేసి తన తల్లి ఆచూకీ కనిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. అక్టోబరు 3న అమ్మతో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలు అవుతాయని ఊహించలేదని, వార్తల్లో వరదల గురించి తెలిసిన వెంటనే ఆర్మీ హాట్‌లైన్ నంబర్లకు ప్రయత్నించినా అవి పనిచేయడం లేదని వాపోయారు. ఇకపోతే గత మంగళవారం అర్ధరాత్రి సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు, సరస్సులు పొంగి పొర్లాయి. దీంతో లాంచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోంది. ముందస్తుగా అధికారులు దిగువకు నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.