సింగరేణి (Singareni) ఎన్నికల నిర్వహణ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలంటూ యాజమాన్యం హైకోర్టు ఫుల్బెంచ్ను ఆశ్రయించడంతో వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
గత నెల 27న విడుదలైన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6,7 వ తేదీల్లో నామినేషషన్లు స్వీకరించాల్సి ఉంది. 9వ తేదీ నాటికి నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించగా, 10న పోటీలో ఉండే అభ్యర్థులకు గుర్తులను కేటాయించవలసి ఉంది. కాగా 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలనుకున్న సమయంలో సంస్థ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది అరవింద్ సూద్ ఎన్నికలు వాయిదా వేయాలని వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా శాసనసభ ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారని, ఈ పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి ఎన్నికలను నిర్వహించడం కష్టమని, అదీగాక సింగరేణి ప్రాంతం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కాబట్టి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని వివరించారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం నామినేషన్లు సమర్పించాలని కార్మిక సంఘాలకు మెయిల్స్ పంపింది కేంద్ర కార్మిక శాఖ.
ఈ క్రమంలో ఏఐటీయూసీ, (AITUC), బీఎంఎస్ (BMS), హెచ్ఎంఏస్(HMS), ఐఎఫ్ టీయు (IFTU) కార్మిక సంఘాలు షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని, కోర్టు తీర్పును అనుసరించి తర్వాత ప్రక్రియ ఉంటుందని, తాము నామినేషన్లు దాఖలు చేస్తామని చెబుతున్నారు.