సింగరేణి (Singareni)లో గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్ర లేబర్ కమిషనర్ ఎన్నికల తేదీ ప్రకటించగా, నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు పూర్తయ్యింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కొద్ది రోజుల క్రితం కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నుంచి ఇంధన కార్యదర్శి ఎన్నికల నిలుపుదలకు కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. కానీ ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది.
మరోవైపు తెలంగాణ (Telangana)లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి ఎన్నికల్లో పాగా వేయటానికి అటు ఏఐటీయూసీ (AITUC) ఇటు ఐఎన్టీయూసీ (INTUC) పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్- సీపీఐ (CPI) పార్టీల అనుబంధ సంఘాలు గత ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి ఓటమి పాలయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ (BRS) అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ (TBGKS) గత రెండు సార్లు విజయం సాధించింది. మూడోసారి గెలిచి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతోంది.
కానీ బీఆర్ఎస్ అధిష్టానం టీబీజీకేఎస్ నాయకులకి షాక్ ఇచ్చింది. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో.. టీబీజీకేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర గణంతో చర్చలు జరుపుతోన్నట్టు తెలుస్తోంది..
మరోవైపు సంఘం నాయకుడు మిర్యాల రాజిరెడ్డి.. కేసీఆర్ నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమని మండిపడ్డారు.. ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడం బాధాకరమని టీబీజీకేఎస్ నేతలు పేర్కొన్నారు. అయితే, టీబీజికేఎస్ కు సంబంధించిన అగ్ర నాయకత్వం అంత కూడా ఐఎన్టీసీలో చేరటానికి సిద్ధం అవుతుండగా.. సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ మాత్రం మైన్స్ మీద దృష్టి సారించింది. తమ సంస్థలో క్రింద క్యాడర్ నాయకత్వాన్ని చేర్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది..