తెలంగాణ (Telangana)లో సింగరేణి ఎన్నికలు (Singareni Elections) కాక రేపుతున్నాయి. ఎన్నో ఉత్కంఠ పరిస్థితులను దాటుకొని మొత్తానికి సింగరేణి ఎన్నికలు జరగడానికి సర్వం సిద్దమైంది. కాగా 7 వ సారి జరగనున్న సింగరేణి ఎన్నికలను రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు రేపు 11 ప్రాంతాల్లో నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
ఈ ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతాయని అధికారులు వెల్లడించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్‌లో తొలిసారిగా సింగరేణి ఎన్నికలు జరుగుతోన్న క్రమంలో ప్రస్తుతం సింగరేణి ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.. ఇక RG-1లో 11 పోలింగ్ కేంద్రాలు, RG-2లో ఆరు, RG-3లో ఆరు ఇలా మొత్తం 23 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్దం చేసారు.
మూడు కేంద్రాల్లో కౌంటింగ్‌కు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవనుండగా.. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.. బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం.. రామగుండం ఏరియాలో మూడు డివిజన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎన్నికల అధికారులుగా డివిజన్ కి ఒక ఆర్డీఓను, కలెక్టర్ నియమించారు.
ఇప్పటికే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. కాగా, సోమవారం సంస్థ వ్యాప్తంగా ఆయా డివిజన్ల అధికారులు పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పోలింగ్ రోజున ప్రతి ఉద్యోగి తమ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని వారు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. గుర్తింపు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని.. సింగరేణి వ్యాప్తంగా 13 కార్మిక సంఘాలు పరీక్షించుకోనున్నాయని తెలుస్తోంది..