రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ (Congress) మంచి ఊపు మీద ఉంది. ఇదే క్రమంలో ఈ నెల 27న జరగబోయే సింగరేణి ఎన్నిక (Singareni Elections)లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపించినట్టుగానే ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని అడుగులు వేస్తోంది.
ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ఆ పార్టీ వ్యూహాలు రెడీ చేస్తోంది. అన్ని డివిజన్లలో తన అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించే బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబు తీసుకున్నారు. ఇప్పటికే ఐఎన్టీయూసీ నేతలతో పాటు ఆయా ప్రాంత ఎమ్మెల్యేలతో మంత్రి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని, ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై వారికి సూచనలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీబీజీకేఎస్ విజయాలకు పుల్ స్టాప్ పెట్టాలని శ్రీధర్ బాబు సూచనలు చేశారు. సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలను ప్రతి నాలుగేండ్లకు ఒక సారి నిర్వహిస్తూ వస్తున్నారు. లెక్క ప్రకారం 2021లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
కానీ కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో డిసెంబరు 27న ఎన్నికలను నిర్వహించనున్నారు. మొత్తం 11 డివిజన్లలోని సుమారు 40 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మూడు సార్లు సీపీఐ అనుబంధ కార్మిక సంస్థ ఏఐటీయూసీ, ఒక సారి ఐఎన్టీయూసీ, రెండు సార్లు టీబీజీకేఎస్ విజయం సాధించాయి.