నేటి సమాజంలో ప్రేమ వివాహాలు సర్వసాధారణంగా మారిపోయాయి.. కానీ లవ్ మ్యారేజ్ చేసుకొన్న జంటలు కడవరకు కలసి ఉంటున్నారా అంటే అవుననే సమాధానం మాత్రం వినిపించదు. ఎందుకంటే.. ప్రేమ అనేది ఒక ఆకర్షణ అని ఎన్నో జంటల్లో నిరూపించబడింది. కొత్తలో బాగుంటుంది. కొన్నాళ్ళుపోయాక మొదట్లో ఉన్న ఆ ప్రేమ స్థానంలో పలు రకాల సమస్యలు రావడం.. ఊహించిన జీవితానికంటే భిన్నంగా లైఫ్ ఉండటం.. తర్వాత ఎన్నో మలుపులు..
అయితే ప్రేమ వివాహాల్లో కొన్ని మాత్రం కన్నవారికి కడుపుకోతను మిగల్చడం కనిపిస్తుంది. ముఖ్యంగా పరువుతో, ప్రేమతో బ్రతికిన కుటుంబానికి ఇలాంటి చర్యలు శాపంగా మారుతుండటం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటనే సిరిసిల్ల (Sircilla) పట్టణంలో ఓ తల్లిదండ్రులకు ఎదురైంది.. స్థానికంగా ఉంటున్న చిలువేరి మురళి, కూతురు అనూష, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
ఈ క్రమంలోనే ఆమె చదివే కాలేజీలో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమ (Love)గా మారి.. చివరికి పెళ్లి వరకి వెళ్ళింది. అల్లారు ముద్దుగా పెంచుకొన్న కూతురు (Daughter)ను ఉన్నత చదువులు చదివిస్తే.. చివరికి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించినోడినే పెళ్లి (Marriage) చేసుకొంది. కూతురిపై పెంచుకొన్న ఆశలను కూకటి వేళ్ళతో సహా పెకిలించింది. తన దారి తాను చూసుకొంది.
అయితే తమను కాదనుకుని వెళ్లిపోయిన కూతురు విషయంలో ఆ తండ్రి కఠినమైన నిర్ణయం తీసుకొన్నాడు.. ఇక నుంచి తన కూతురు చనిపోయిందంటూ ఇంటి ఎదుటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపాడు. అయినా నేటి కాలంలో అమ్మాయిలు ఎలా మోసపోతున్నారో నిత్యం వార్తల్లో వస్తున్నా.. వయస్సు రాగానే ప్రేమ అంటూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొంటున్న వారికి నిజాలను గ్రహించే జ్ఞానం కలుగక పోవడం ఆందోళన కలిగించే విషయంగా కొందరు పేర్కొంటున్నారు..