ప్రతి నియోజక వర్గంలో నేతలు జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంతవరకు ఓటర్లను ఆకర్షించాలో అంతవరకు విశ్వప్రయత్నాలు చేసి తమ మాటలతో ప్రజలని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP) అభ్యర్థి రాణి రుద్రమ (Rani Rudrama) సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం (Election Campaign)ప్రారంభించారు. వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రచారంలో పాల్గొన్న రాణి రుద్రమ బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సిరిసిల్లకు యువరాజుగా ఫీల్ అవుతున్న మంత్రి కేటీఆర్ చెప్పే కాకమ్మ కబుర్లు విని ఇక్కడి ప్రజలు ఓట్లు వేసే స్థితిలో లేరని రాణి రుద్రమ విమర్శించారు. సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దొరల గడీల పాలనను బద్దలుకొట్టే సమయం దగ్గర్లోనే ఉందని రాణి రుద్రమ మండిపడ్డారు.
తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటే ఒక కార్యకర్తగా మీ మధ్య ఉన్నానని తెలిపారు. బీజేపీ మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి.. సముచిత స్థానం కల్పిస్తోందని తెలిపిన రాణి రుద్రమ ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని పేర్కొన్నారు.. బీజేపీ మహిళలకు కేంద్ర మంత్రులుగా, రాష్ట్రపతిగా అవకాశం కల్పించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.