ప్రధాని మోడీకి కుటుంబం లేదని, పిల్లలు లేరంటూ ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఆయనకు కౌంటర్ ఇస్తున్నారు. మేమంతా ప్రధాని మోడీ కుటుంబ సభ్యులమని చెబుతున్నారు. సోషల్ మీడియా ఎక్స్ బయోలో పేరు తర్వాత బ్రాకెట్లో ‘మోదీ కా పరివార్’ అని రాస్తున్నారు.
ఇప్పటి వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాశారు. తాజాగా లాలు వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) మండిపడ్డారు. దాణా దొంగ అయిన లాలు ప్రసాద్ యాదవ్‌కు మోడీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు. నాగ్‌పూర్‌లో జరిగిన బీజేపీ నమో యువ మహా సమ్మేళనలో స్మృతి ఇరానీ పాల్గొన్నారు.
మేమంతా ప్రధాని మోదీ కుటుంబ సభ్యులం. ఆయనకు అండగా ఉంటాం. ఇచ్చిన హామీలను మోడీ నెరవేర్చారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేశాం. మీ లాగా కుంభకోణాలు చేయలేదు. దాణా కుంభకోణం చేసిన దొంగ లాలు ప్రసాద్ యాదవ్ అంటూ స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో యూపీఏ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. మోడీ హయాంలో పదేళ్లలో నిరుపేదలు, మహిళలు, రైతుల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.