వన్యప్రాణులను అక్రమరవాణా చేస్తున్న వ్యక్తి బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ (Bangalore Airport)అధికారుల చేతికి చిక్కాడు. 2 ట్రాలీ బ్యాగుల్లో 234 వన్య ప్రాణుల(Wild animals)ను బంధించడాన్ని చూసి కస్టమ్స్ అధికారులే షాకయ్యారు. వన్య ప్రాణులను స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాదారుణ్ని అదుపులోనికి తీసుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం… దేవనహళ్లి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 21న రాత్రి బ్యాంకాక్ నుంచి ఎఫ్‌డీ-137 విమానంలో ఓ ప్రయాణికుడు దిగాడు. అనంతరం గ్రీన్ ఛానల్(Green Channel) దాటి విమానాశ్రయం అరైవల్ ప్రాంతం నుంచి డిపార్చర్ గేట్ వైపు వస్తున్నాడు.
ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు అనుమానంతో అతడిని ఆపి..రెండు ట్రాలీ బ్యాగులను తనిఖీ చేశారు. అందులో 234 వన్యప్రాణులను చూసి అవాక్కయ్యారు. ఈ వన్యప్రాణుల్లో అరుదైన జాతి కొండచిలువలు, ఊసరవెళ్లులు(Chameleons), తాబేళ్లు, ఎలిగేటర్లు, కంగారు పిల్ల సహా మొత్తం 234 వన్యప్రాణులు ఉన్నాయి.
అనంతరం నిందితుడిని కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 104, కింద అరెస్టు చేశారు. రెండు ట్రాలీల్లోని వన్యప్రాణులను కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110 కింద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
అందులో అంతరించిపోతున్న వన్యప్రాణులు, వృక్షాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజర్డ్ స్పెసీస్ ఆఫ్ వైల్డ్ ఫోనా (Fauna), ఫ్లోరా (Flora) – సైట్స్ (CITES) అప్పెండిక్స్లో పేర్కొన్న కొన్ని వన్యప్రాణులు కూడా ఉన్నాయి.