విద్యుదాఘాతానికి(Electrical shock) గురై ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణాజిల్లా(Krishna dist)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తోట్లవల్లూరు(Thotla valluru) మండలంలోని పాములలంక (Pamula lanka) కు చెందిన ఇద్దరు రైతులు పాముల విజయాంభ, పాముల చిరంజీవి సోమవారం మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.
తోటలో వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో కంచికి తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సాయంత్రం అయినా విజయాంభ, చిరంజీవి ఇంటికి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గ్రామస్థులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతవెతికినా రాత్రి వరకూ వారి జాడ దొరకలేదు.
అర్ధరాత్రి 1.30గంటలకు విజయాంభ, చిరింజీవి మృతదేహాలను పొలంలో గుర్తించారు. దీంతో పొలానికి వేసిన కంచెకు కరెంట్ ను తొలగించి ఆ తర్వాత ఇరువురు మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
ఈ ఘటనలకు సంబంధించి గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పాములులంక గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.