తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిశారు. తనను సీఎంగా ఎన్నుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నేతలతో సమావేశమయ్యారు రేవంత్.
ముందుగా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (Venu Gop[al) తో భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. అలాగే, గురువారం తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వేణుగోపాల్ ని రేవంత్ ఆహ్వానించారు.
కేసీతో భేటీ తర్వాత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు రేవంత్. పలు అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో తెలంగాణ అధికార యంత్రాంగం రేవంత్ రెడ్డికి ప్రోటోకాల్ తో పాటు సెక్యూరిటీని కల్పించింది.
ఇక, తెలంగాణ సీఎంగా రేవంత్ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్ర నేతలు సోనియా(Sonia Gandhi), రాహుల్, ప్రియాంక రానున్నారు. ఢిల్లీలో ఖర్గేతో భేటీ సందర్భంగా దీనిపై చర్చించారు రేవంత్. అలాగే, తన ప్రమాణ స్వీకారానికి పార్టీ పెద్దలను ఆహ్వానించారు.
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమ ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఠాగూర్ ట్విట్టర్ లో మాట్లాడుతూ.. రేవంత్ సీఎం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఒక సోదరుడిగా తెలంగాణ ముఖ్యమంత్రికి నా ఎంపీ ఫ్లాట్ లో ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో జరిగే చారిత్రాత్మక ఘట్టానికి నన్ను ఆహ్వానించడానికి ఆయన వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ను ఆయన ఉన్నత శిఖరాలకు ఎక్కించినట్లే రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తారన్న నమ్మకం నాకుంది’’ అంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు.