రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రి పదవులు చేపట్టిన వారు.. వారి వారి శాఖలలో ఉన్న లోటుపాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పలువురు మంత్రులు అన్ని శాఖలలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.. ఇక ప్రజల సంక్షేమం కోసం పాటుపడే మనిషిగా గుర్తింపు తెచ్చుకొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క.. ములుగు జిల్లా రంగారావు పల్లి గ్రామ సమీపంలో ఉన్న పంప్‌హౌస్‌ను పరిశీలించారు.
గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకుండా.. ఇతర ప్రాంతాలకు తీసుకుపోయిందని ఆరోపించారు. రామప్ప రిజర్వాయర్ (Ramappa Reservoir) ద్వారా పక్క నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తోందని సీతక్క (Seethakka) మండిపడ్డారు.. ఈ ప్రాంత అన్నదాతలకు త్వరలోనే రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని.. ఇప్పుడు అలా జరగదని పేర్కొన్నారు..
పంప్‌హౌస్ నుంచి మిగతా మండలాలకు సైతం సాగు నీరు అందేలా కృషి చేస్తానని తెలిపిన సీతక్క.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు.. మరోవైపు జంగాలపల్లి చెరువులోకి నీరు వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈరోజు సీతక్కఅదే పంపు స్విచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు. ఈ పంపు కింద ములుగు మండలంలో 1,300 ఎకరాలు, పాకాల 2,300 ఎకరాలు సాగవుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. సీతక్క బుల్లెట్ వదిలి, బ్యాలెట్ పట్టి.. మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే.. గన్‌తో ఉన్నా, గన్‌మెన్‌తో ఉన్నా బలహీనవర్గాల కోసమే ఆరాటపడుతూ.. వారి కూడు, గూడు, గుడ్డ కోసమే తన పోరాటం అని సీతక్క పలుమార్లు తెలిపిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో అధికారంలో ఉన్న సీతక్క ప్రజలకి ఏమేరకు మేలు చేస్తుందో చూడాలి అనుకుంటున్నారు..