తెలంగాణ (Telanagana) రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ పక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే కొత్త రేషన్ కార్డుల (New Ration Card) కోసం అధికారులు ప్రత్యేక ఫారమ్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలనలో, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొత్తగా సిద్ధం చేసిన ఫారమ్ లో పిల్లల పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా వివరాలు ఉన్నాయి.
కొత్తగా రూపొందించిన దరఖాస్తు ఫారమ్ (Applications)లో దరఖాస్తు దారు ఇంటి యజమాని పేరు, కుటుంబం మొత్తం కలిపి దిగిన ఫోటో, కులము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచేలా కిందనే బాక్స్ రూపంలో ఇచ్చారు. అందులో తల్లిదండ్రుల పేర్లని, పిల్లలు ఎంతమంది ఉన్నారనే వారి పేర్లు, ఆధార్ కార్డు నెంబర్ తో సహా వివరించాల్సి వుంటుంది. ఈ దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరోవైపు జనవరి 2024లో కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ.. గ్రామసభల నుంచి నేరుగా రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. తొలుత అర్హులైన వారికే కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అర్హులను పరిశీలించి కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు సమాచారం.
అయితే రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ముందుగా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి అర్హతను నిర్ధారించి, జనవరి నెలలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది. అన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. మండల అధికారిగా ఉన్న తహసీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గ్రామాలకు వెళ్ళి.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుపై ప్రజలకు అవగాహన కలిగేలా వివరించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు..