– ముస్లిం ఐటీ పార్క్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు
– ఓట్ల రాజకీయం అంటున్న ప్రతిపక్షాలు
– సోషల్ మీడియాలో జోరుగా చర్చ
– ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే ఉంటాయి
– మతాల వారీగా కాదంటూ నెటిజన్ల ప్రశ్న
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. అందులో అమలుకు సాధ్యమా? కాదా? అనే ఆలోచన లేకుండా ఇష్టారీతిగా హామీలు గుప్పించారనే అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. మరోసారి అధికారమే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తూ.. ఓటర్లను ప్రలోభపెడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
అధికారం లేకపోతే బతుకు లేదనేలా ప్రవర్తిస్తున్న ప్రభుత్వ తీరును ఇప్పటికే మేధావి వర్గాలు ఎండగడుతున్నాయి. కుటుంబ పాలన చేస్తున్నదని కారు పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇన్ని ఒత్తిళ్ల మధ్య బీఆర్ఎస్ అధికారం చేపట్టడం కష్టం అనుకున్నది కావచ్చు.. నలుగురు మెచ్చకపోయినా ఫర్వాలేదు అనే విధంగా ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చిన హామీలను ఇస్తూ పదవులను కాపాడుకునే ప్రయత్నంలో పడిందని ప్రచారం జరుగుతోంది.
తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ కు అధికారాన్ని అప్పగిస్తే.. ముస్లిం యువత కోసం ప్రత్యేకంగా ఓ ఐటీ పార్క్ ను హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది అధికార దాహానికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ముస్లింలు ఉన్నారు. వీరంతా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను పొందుతున్నారు.
ఉద్యోగం అనేది ప్రతిభ ఆధారంగానే వస్తుంది.. మతాన్ని బట్టి కాదన్న విషయం ఒక హోదాలో ఉన్న పెద్దమనిషి విస్మరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నెటిజన్లు అంటున్నారు. కేవలం ముస్లిం ఓట్ల కోసం ఏదిబడితే అది చెప్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు, మైనార్టీ వర్గాలను గత పాలకులు పట్టించుకోలేదని.. కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.