తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గర పడుతోన్న నేపధ్యంలో నోట్ల కట్టలు రోడ్డు ఎక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 40 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 13న బెంగళూరులోని ఓ కాంగ్రెస్ (Congress) నేత ఇంట్లో తెలంగాణకు తరలిస్తున్న 42 కోట్ల నగదు పట్టుకున్న సంగతి తెలిసి పేద ప్రజల గుండెలు ఆవిసిపోయాయి.
ప్రస్తుతం కూడా ఇలాంటి ఘటనే వరంగల్ (Warangal) జిల్లాలో చోటు చేసుకోంది. పర్వతగిరి మండలం సోమారం గ్రామంలోని బీఆర్ఎస్ సర్పంచ్, రాపాక రేణుక నాగయ్య ఇంట్లో ఎన్నికల స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయగా.. ఓటర్లకు పంచేందుకు రెడీగా ఉన్న చీరలు, వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సులు, బ్యాగులు భారీగా పట్టుబడ్డాయి. వర్దన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఫొటో, లోగోలతో ఉన్న బ్యాగులను, బాటిల్స్ ను అధికారులు గుర్తించారు.
పక్కా సమాచారంతో ఎన్నికల స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన అధికారులు వీటిని పర్వతగిరి పోలీసులకు అప్పగించారు. మరోవైపు శ్రీరంగ నీతులు చెబుతోన్న అధికార పార్టీ పెద్దలు, పదవులే పరమావధిగా ప్రవర్తిస్తున్న వారి విషయంలో ఎలా స్పందిస్తారో..? అని కొందరు అవినీతి అంటే గిట్టని వారు అనుకొంటున్నారు.