ఐదు వందల ఏండ్ల పోరాటం తర్వాత అయోధ్య (Ayodhya) లో రామ మందిరం కొలువైంది. చరిత్రలో నిలిచిపోయేలా ఆలయాన్ని రూపొందించారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మూడో దేవాలయంగా ఇప్పటికే రామ మందిరం రికార్డు సృష్టించింది. ఈనెల 22న ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుండగా.. ‘రాష్ట్ర’ (Raashtra) వరుస కథనాలు ఇస్తోంది. ఇప్పటికే పలు విషయాలను వివరించగా.. ఇప్పుడు రామ మందిర ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా, అపురూపంగా రామ మందిరాన్ని రూపొందించారు. మొత్తం 5 గుమ్మటాలు ఉన్నాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో నిర్మాణం జరిగింది. సోమ్ నాథ్, అక్షర్ థామ్ లాంటి అనేక పుణ్యక్షేత్రాల ఆకృతులను నిర్మించిన సోంపుర కుటుంబమే రామ మందిరాన్ని రూపొందించింది. నాగర శైలిలో అయోధ్య ఆలయ నిర్మాణం జరిగింది. ఎక్కడా ఇనుము, సిమెంట్ వాడలేదు. కేవలం రాతి పలకలతోనే నిర్మాణం చేశారు.
2వేల ఏళ్లపాటు ఆలయ పటిష్టత దెబ్బతినకుండా.. రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రత ఉండే భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా నిర్మించారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరంలో నిల్చున్నా, రాముడి విగ్రహం కనిపించేలా నిర్మాణం చేశారు. ప్రధాన గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది.
ఈ నూతన రామాలయంలో ఐదు మండపాలు(హాళ్లు) ఉంటాయి. ఇవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనల మండపం. దేవతా మూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు, గోడలపై తీర్చిదిద్దారు. సింహద్వారం నుండి ప్రవేశించే భక్తులు 32 మెట్ల ద్వారా ఆలయం లోపలకి చేరుకుంటారు. ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార ప్రహరీగోడ ఉంటుంది. ఆలయంలో దివ్యాంగులు, వృద్ధ యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఆలయంలో ర్యాంప్ లు, లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు. మందిరానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప) ఉంది. 25 వేల మంది యాత్రికులకు సరిపడేలా సౌకర్యాల కేంద్రం(పీఎఫ్సీ) నిర్మిస్తున్నారు. యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాలు కల్పించనున్నామని ట్రస్ట్ ఇప్పటికే తెలియజేసింది.
అయోధ్య రామ మందిరం ఎన్ని ఎకరాల్లో నిర్మించారు? చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఏఏ నిర్మాణాలు జరుగుతున్నాయి..? ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ఇలాంటి మరిన్ని విశేషాలను తర్వాతి కథనంలో చూద్దాం.