లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి (Bhadradri) సీతారాముల కల్యాణ (Sitaramula Kalyanam) ఘట్టం లైవ్ టెలీకాస్ట్ పై నెలకొన్న ఉత్కంఠ వీడింది. ఇటీవల ప్రభుత్వానికి లైవ్ ప్రసారం చేయవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha).. ఈ కల్యాణాన్ని ప్రభుత్వం తరఫున ప్రత్యక్షప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఈవో వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.
అయితే తాజాగా రాములవారి కల్యాణం లైవ్ టెలీకాస్ట్‌కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఎన్నికల నియమావళి ఉల్లంఘించకుండా ప్రసారం నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది.. మరోవైపు దాదాపు 40 ఏళ్లుగా రాములోరీ కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని.. ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రి లేఖ ద్వారా ఈసీని కోరారు..
దీంతో నిబంధనలు ఉల్లంఘించకుండా జరుపుకోవాలని తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి నిరాశతో ఉన్న భక్తులకు ఈ విషయం తలపై పన్నీరు చల్లినంత ఆనందాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రతి సంవత్సరం భద్రాచలం (Bhadrachalam) సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందన్న సంగతి తెలిసిందే..
అయితే అక్కడికి వెళ్లి సీతారాముల కల్యాణాన్ని చూడలేని భక్తులు టీవీల్లో చూసి తరిస్తారు. ఇక ప్రతి ఏటా భద్రాచలం మిధిలా స్టేడియం నుంచి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తారు. అశేష భక్త జనం మధ్య ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతుంది.