– శ్రీశైలం దసరా ఉత్సవాల్లో గోల్ మాల్
– నిలదీసిన రిపోర్టర్ కు బెదిరింపులు
– అందరి ముందే రెచ్చిన ఏఈవో మోహన్
– ఆలయ పరిసరాల్లో..
– అసభ్య పదజాలం వాడుతూ వార్నింగ్
– మోహన్ తీరుపై హిందూ సంఘాల ఆగ్రహం
– ఏఈవో అన్యమతస్తుడు అంటూ ఆరోపణలు
– శ్రీశైలంలో అన్యమతస్తుల ఆగడాలు..
– మితిమీరుతున్నాయని ఆగ్రహం
– అధికార పార్టీ అండదండలతో..
– రెచ్చిపోతున్న అన్యమతస్తుల గ్యాంగ్!
శ్రీశైలం ఆలయంలో అన్యమతస్తుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఆలయం చుట్టుపక్కల ఏం చేయాలన్నా.. లోపల ఏం జరగాలన్నా వాళ్ల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈమధ్యే షాపుల విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. ముస్లింలకు ఆలయ సమీపంలో షాపులు కేటాయించడంపై ప్రశ్నించిన బీజేపీ నేతపై దాడికి పాల్పడ్డారు కొందరు. దీనిపై వివాదం కొనసాగుతుండగా.. ఏఈవో మోహన్ వ్యవహారం వెలుగుచూసింది.
ఆలయం పరిసరాల్లో ఇష్టానుసారంగా బూతులు తిడుతూ కనిపించాడు మోహన్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈయన క్రైస్తవుడు అనే ఆరోపణలు ఉన్నాయి. 2018లోనే ఈ విషయం బయటకు వచ్చినా నామమాత్రపు చర్యలు తీసుకుని.. కొన్నాళ్లు సస్పెండ్ చేసి మళ్లీ తిరిగి ఏఈవో స్థాయి అధికారిగానే దేవస్థానంలో చోటు కల్పించారని చెబుతున్నాయి హిందూ సంస్థలు. 2020లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా సస్పెండ్ అయినట్టుగా చెబుతున్నాయి. పవిత్రమైన శ్రీశైల ఆలయంలో అన్యమతస్తులు అధికారులుగా ఉంటూ.. అభ్యంతరకరమైన భాషను వాడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నాయి.
నిజానికి, శ్రీశైల దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భారీగా గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏఈవో మోహన్ వీఐపీ దర్శనాల విషయంలో డబ్బులు దండుకున్నారనే గుసగుసలు వినిపించాయి. అధికార పార్టీ అండదండలతో దేవస్థానంలో విచ్చలవిడిగా రూల్స్ బ్రేక్ చేస్తున్నారని.. ఇతర ఉద్యోగులే మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంతేకాదు, తాను చెప్పిన వార్తలు మాత్రమే రాయాలి.. వ్యతిరేకంగా ఏమైనా రాస్తే బెదిరింపులకు పాల్పడుతుంటారని జర్నలిస్టు వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైల దసరా నవరాత్రుల ఉత్సవాల గోల్ మాల్ పై ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన ఏఈవో మోహన్ బూతులు తిడుతూ బయటకు రా నీ అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
న్యాయ వ్యవస్థను సైతం గౌరవించకుండా అసభ్య పదజాలంతో ఏ కోర్టుకు వెళ్తావో వెళ్లు అంటూ బహిరంగంగానే హెచ్చరించాడు మోహన్. ఏ న్యాయ వ్యవస్థ కూడా తనను ఏం చేయలేదని రెచ్చిపోయాడు. ఈ దృశ్యాలు బయటకు వస్తే నీ అంతు చూస్తానని కూడా బెదిరించినట్టుగా సమాచారం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండడంతో హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. ఏఈవో మోహన్ అన్యమతస్తుడని.. ఇలాంటి వాళ్ల వల్ల శ్రీశైలం దేవస్థానం పరువు పోతోందని అంటున్నాయి. పవిత్రమైన సన్నిధిలో ఉంటూ ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు మాట్లాడుతున్న ఏఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మోహన్ ఇప్పటికే మూడుసార్లు సస్పెండ్ అయినట్టు సమాచారం. గతంలో ఏఈవోగా ఉంటూనే క్రిస్టియన్ ప్రార్థనల్లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో వివాదం చెలరేగింది. దీంతో కొన్నాళ్లు అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇంత జరిగినా మోహన్ తీరులో మార్పు రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా ఘటనే అందుకు నిదర్శనమని అంటున్నాయి హిందూ సంఘాలు. సామాజిక వర్గం ప్రస్తావన తీసుకొచ్చి విలేఖరిపై నోటికొచ్చినట్టు మాట్లాడతారా? అంటూ మండిపడుతున్నాయి. హిందువులు మౌనంగా ఉన్నంతవరకు అన్యమతస్తులు దేవాలయాల్లో రాజ్యమేలుతూనే ఉంటారని.. ఎప్పుడైతే మౌనం వీడుతారో అప్పుడే ఇలాంటి అధికారులకు బుద్ధి వస్తుందని అంటున్నాయి హిందూ సంఘాలు.