కార్తీక మాసం(Karthika masam) వచ్చిందంటే చాలు.. కార్తీక స్నానాలు చేయడం, కార్తీక దీపాలు వెలిగించడం ఆనవాయితీ. కొందరు నిష్టగా కఠినమైన ఉపవాసాలు పాటిస్తుంటారు. ప్రముఖ ఆలయాలను సందర్శిస్తుంటారు. తెలుగు రాష్టాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో ముస్తాబయ్యాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srishailam temple)లో రేపటి(మంగళవారం) నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.. కాగా, నవంబర్ 14 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనుంది. శ్రీశైలం దేవస్తానం భక్తుల రద్దీ దృష్ట్యా మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు.
స్వామివారి ఆలయంలో నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. శనివారం, ఆదివారం, సోమవారంతో పాటు సెలవురోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్ననేపథ్యంలో.. స్వామివారి స్పర్శ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వారాంతంలో భక్తుల రద్దీ ఉండే నేపథ్యంలో.. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని శ్రీశైలం ఆలయం ఈవో పెద్దిరాజు వెల్లడించారు. కాగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో శ్రీశైలంలో క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోన్న విషయం విధితమే.
సాధారణంగా ఏటా దీపావళి మరుసటి రోజే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది దీపావళి మరుసటి రోజు కాకుండా రెండో రోజు నుంచి ప్రారంభమవుతోంది. అంటే ఇవాళ సూర్యోదయానికి అమావాస్య ఉంది. మంగళవారం ఉదయం సూర్యోదయం సమయానికి పాడ్యమి వచ్చింది. ఈ బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానాలు ఆచరించాలని పండితులు చెబుతున్నారు.