రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఇచ్చిన హామీలు అమలుచేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ సీఎంగా రాష్ట్ర పగ్గాలు చేపట్టడం..సవాల్ తో కూడుకొన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతోన్నారు.. కాంగ్రెస్ పై ఉన్న నిందను చెరిపి, అప్పుల తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ఉన్న వనరులని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
ఇదే సమయంలో పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఎన్నికలకు ముందు కేసీఆర్ (KCR) సర్కార్ శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ (Telangana) వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో వివిధ పనుల కోసం మంజూరీలు ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి ఎస్డీఎఫ్ నుంచి పెద్ద ఎత్తున పనులు మంజూరు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో వందల కోట్లకు పైగా, ఈ తరహా పనులు మంజూరయ్యాయి.
అయితే ఆ పనుల్లో కొన్ని ప్రారంభమై వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని ప్రారంభం కాలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటై పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతోన్న నేపథ్యంలో.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వివిధ పనుల మంజూరీలు, ఇంకా ప్రారంభం కాని పనులను ఆపివేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లన్నింటిని ఆపివేయాలని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. కాగా కేసీఆర్ ప్రభుత్వం అవలంభించిన విధానాలు, అధికారుల వైఖరిపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. రాష్ట్రాన్ని నాశనం చేసి.. తమకంటే బాగా ఎవరు పాలించలేరని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఇప్పటికే మంత్రులు మండిపడ్డారు..