ఉత్తర కొరియా(North Korea) నిన్న (మంగళవారం) తన పశ్చిమ సముద్రంలోకి అనేక క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొనింది. ఈనెలలో ఈ తరహా క్షిపణులను పరీక్షించడం పది రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా మూడో కవ్వింపు చర్యగా చెబుతున్నారు. ఈ నెల 24, 28వ తేదీల్లో జలాంతర్గాముల(Submarines) నుంచి ప్రయోగించగల క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది.
ఈ నెల 14న ఘన ఇంధనంతో నడిచే మధ్యశ్రేణి క్షిపణిని సైతం నార్త్ కొరియా పరీక్షించింది. ఉత్తర కొరియా దుందుడుకు చర్యల నేపథ్యంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ల త్రివిధ దళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
ఈనెల 28న ఉత్తర కొరియా తూర్పు తీరం దిశగా పలు క్రూజ్ క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. తమదేశం లోని ప్రధాన సైనిక స్థావరం మీదుగా వెళ్లినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అమెరికా నిఘా విభాగం దీన్ని ధ్రువీకరించింది. అయితే ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనే సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు.
గత వారం కిమ్‌జోంగ్ ఉన్ ప్రభుత్వం ఒక వ్యూహాత్మక క్రూజ్ క్షిపణిని పరీక్షించింది. దానికి అణ్వాయుధ సామర్థ్యం ఉందని పేర్కొంది. గతవారం తమ సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడాన్ని ఉత్తర కొరియా ఖండించింది. వాటికి ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.