ఒకప్పుడు గుండెపోటు అంటే.. ఓ 65-70 ఏళ్లకు వచ్చేది. రోజులు గడిచేకొద్దీ దీని టైమింగ్స్ కూడా మారిపోయాయి. సంవత్సరాలు తగ్గుతూ వస్తున్నాయి. పరిస్థితి ఎలా తయారైందంటే.. ప్రజెంట్ చిన్న పిల్లల హార్ట్ (Heart) సైతం ఆగిపోతోంది. దీన్నిబట్టి అర్థం చేసుకోండి.. మన గుండె ఎంత క్రిటికల్ వాతావరణంలో ఉంటుందో. తాజాగా కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఇంటర్ (Inter) విద్యార్థిని హార్ట్ ఎటాక్ (Heart Attack) తో చనిపోయింది.
గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి. ఈమె ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీలో ఫ్రెషర్స్ డే నిర్వహించగా.. ఎంతో ఉత్సాహంగా పాల్గొంది ప్రదీప్తి. ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. అయితే.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. చుట్టూ ఉన్నవారు ఏమైందో అని తెగ కంగారుపడ్డారు.
కొందరు సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రదీప్తి చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలికి చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం ఉందని చెబుతున్నారు. ఆపరేషన్ చేయించాలంటే.. అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పగా.. ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు చేయించలేదని తెలుస్తోంది.
మొత్తానికి.. వయసుతో నిమిత్తం లేకుండా ఈమధ్య గుండెపోటు మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు ఇలా ఇతర ఆరోగ్య సమస్యలే గుండెపోటుకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.