సూర్యా పేట (Suryapet) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి (Student) ఒకరు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మరణించాడు. ఈ ఘటన జ్యోతిభా పూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం చోటు చేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో మండలంలో ఒక్క సారిగా కలకలం రేగింది.
ఆలకట్ల వెంకన్న, జయలక్ష్మీ దంపతుల స్వగ్రామం నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందపురం గ్రామం. వెంకన్న దంపతుల కుమారుడు రాకేశ్ (16) జ్యోతిభా పూలే బీసీ సంక్షేమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రాకేశ్ బుధవారం హాస్టల్ లోని పాత మరుగుదొడ్ల వద్ద ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని మృతి చెందాడు.
ఈ విషయాన్ని విద్యార్థులు గురువారం గుర్తించి వార్డెన్ కు సమాచారం అందించారు. దీంతో వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాకేశ్ మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాకేశ్ కాళ్లు నేలకు తాకుతున్నాయని, అది ఖచ్చితంగా ఆత్మహత్య కాదని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇది ఇలా వుంటే గణేష్ నిమజ్జనం సందర్భంగా బుధవారం స్కూల్ ముగిసిన వెంటనే విద్యార్థులు పక్క గ్రామానికి వెళ్లి డప్పులు కొట్టారు. దీంతో పాఠశాల ముగిసిన వెంటనే హాస్టల్ కు రాకుండా పక్క గ్రామానికి వెళ్లి డప్పులు కొట్టడంపై ఓ ఉపాధ్యాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారిని మందలించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. మరికొందరు లైట్ల విషయంలో వార్డెన్ మందలించారని అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.
తమ కుమారున్ని హత్య చేసి ఆత్మహత్యగా చీత్రకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు హాస్టల్ ఎదుట ధర్నా చేశాయి. రాకేశ్ మృతిపై విచారణ జరిపి దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.