దేశంలో అతి పొడవైన తీగల వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. గుజరాత్‌లోని ద్వారకలో నిర్మితమైన ఈ 2.3 కిలోమీటర్ల పొడవు ఉన్న బ్రిడ్జ్‌కు సుదర్శన్ సేతు(Sudarshan Sethu) అని పేరు పెట్టారు. ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు.
2017 అక్టోబర్‌లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారక ద్వీపాన్ని ఈ వంతెన కలుపుతుంది. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది.
ద్వారకాధీశ్ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్ కూడా ఉంది. దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తీగల వెంతెన ప్రారంభోత్సవానికి ముందు బేట్ ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వంతెనపై పలు చోట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడి బెట్ ద్వారకా ద్వీపంలో ఉన్న ద్వారకాదీశ్ ఆలయంలోనూ ప్రధాని పూజలు చేయనున్నారు.