పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ (Nizamabad) లోక్సభ సెగ్మెంట్లో ఒకే నినాదం హోరెత్తుతోంది. ఒక్క చాన్స్ ఇస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ(Nizam sugars)ని తెరిపిస్తామని ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఓటర్లను వేడుకుంటున్నారు. దీంతో నిజామాబాద్ రాజకీయం అంతా చెరుకు రైతుల చుట్టూనే తిరుగుతోంది. నిజామామాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 64.4 శాతం గ్రామీణ ఓటర్లు ఉన్నారు.
అందులోనూ ఎక్కువగా రైతులే ఉండటం గమనార్హం.ప్రస్తుతం అక్కడి చెరుకు రైతులు(Sugarcane Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2018 ముందస్తు ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్.. 2019 ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులకు ప్రామిస్ చేశారు.
కానీ, వారు తమ మాటను నిలుపుకోలేదు. నిజాం షుగర్స్ ను తెరిపించాలని స్థానిక చెరుకు రైతులు ఉద్యమబాట పట్టారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు.ప్రస్తుతం రాష్ట్రంలో అధికార బదిలీ జరిగింది.సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిజామాబాద్ వెళ్లినప్పుడు నిజాం షుగర్స్ తెరవడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని అక్కడి రైతులకు హామీనిచ్చారు.దీంతో చెరుకు రైతుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. అయితే, నిజామాబాద్లో చెరుకుతో పాటు పసుపు ఎక్కువగా సాగు అవుతుంది. ఇప్పటికే పసుపు రైతుల కోసం టర్మరిక్ బోర్డు, స్పైస్ బోర్డు ఏర్పాటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోడీ నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపిస్తే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పారు.కాగా, బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్ పోటీలో ఉండగా..రైతులు ఎవరికి మద్దతుగా నిలుస్తారో వేచిచూడాల్సిందే.