కేసీఆర్ (KCR) ఓ గజ దొంగ అంటూ బీజేపీ (BJP) జాతీయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఎన్నికల ఇంఛార్జ్ సునీల్ దియోధర్ (Sunil Deodhar) అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పెద్దలు దోచుకుంటున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని జైళ్లో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు.
ఖమ్మంలో సునీల్ ధియోధర్ ఈ రోజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కి ఓటు వేసినట్టేనని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ హిందూ వ్యతిరేక పార్టీలేనని ఆయన మండిపడ్దారు. అవినీతి పరులను ప్రధాని మోడీ విడిచి పెట్టబోరని తెలిపారు.
ఖమ్మంలో గిరిజనులు, ఎస్సీలను రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ప్రజల రక్షణ, భద్రతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛ గా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ చెబుతున్న అభివృద్ది, ప్రచారం అంతా కేవలం పోస్టర్ లకు మాత్రమే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిశాయని కావాలనే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని వివరించారు. కేసీఆర్ కూతురు కవిత కేసులో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. అవసరమైతే కవితను వాళ్ళు అరెస్ట్ చేస్తారన్నారు.