ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ(Rohit Sharma) స్థానంలో హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది.
అయితే ఆ జట్టు నిర్ణయాన్ని అభిమానులు తప్పుబట్టారు. అంతేకాదు.. ఆ ప్రకటన చేసిన గంట వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ జట్టు ఇన్స్టాగ్రామ్ ఖాతాను 4లక్షల మంది అభిమానులు వీడారు. అయితే, క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం ముంబైకి మద్దతుగా నిలిచాడు. కెప్టెన్‌ను మార్చడానికి గల కారణాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ముంబై జట్టు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని, 36ఏళ్ల రోహిత్ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని తెలిపారు. టీమ్ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ సారథిగా ఉన్న రోహిత్‌పై భారాన్ని కొంత తగ్గించాలనే హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ముంబై ఇండియన్స్‌తో పాటు రోహిత్‌కు ప్రయోజనం చేకూరనుందని అభిప్రాయపడ్డారు.
హిట్‌మ్యాన్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. టాప్ ఆర్డర్లో హార్దిక్ మరిన్ని పరుగులు రాబడితే జట్టుకు కలిసొస్తుందని, ఇప్పటికే పాండ్యా మూడు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయగలడని తెలిపారు. అప్పుడు ముంబై ప్రతీ మ్యాచ్‌లోనూ 200+ స్కోరు చేసే అవకాశాలు ఉంటాయని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.