వివేకా హత్య కేసు(Viveka Murder Case) విషయమై ఆయన కుమార్తె సునీత(Sunitha) న్యాయపోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఈ తరుణంలో ఆమె వివేకా హత్య కేసు విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ కడప జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సునీత స్పందించారు.
జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు(High Court)ను ఆశ్రయించనున్నట్లు ఆమె తెలిపారు. వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైసీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు.
ప్రతివాదులు, వారి అనుచరులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఈ కేసులో అవినాష్‌రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇలా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవి, వ్యాఖ్యలు చేయరాదని కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో సునీత మాట్లాడుతూ న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైసీపీ అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో తాను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారని తెలిపారు. వివేకా హత్య అంశంపై వైసీపీ నేతలు చాలాసార్లు మాట్లాడారని అన్నారు. ప్రజల ఇళ్ల వద్దకు తాను రాలేకపోతే మన్నించాలని, ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యతను తీసుకోవాలని కోరారు.