ఓటుకు నోటు కేసులో(Vote for Note Case) చంద్రబాబుని(Chandrababu) నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీంకోర్టు(Supreme Court) గురువారం మరోసారి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ సర్కార్ పేర్కొంది.
ఈ క్రమంలో గురువారం జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. సుప్రీంకోర్టు వేసవి సెలవులు ఉన్నాయని, కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగడానికి అవకాశం లేనందున సెలవుల అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూత్ర ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు తదుపరి విచారణను తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
కాగా ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్లో చంద్రబాబు పేరునే ఏసీబీ 22 సార్లు ప్రస్తావించింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు డబ్బును ఎరజూపేందుకు చంద్రబాబు రూ.5కోట్లకు బేరం పెట్టుకునేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. అటు రేవంత్ రెడ్డి రూ.50లక్షలు ఇస్తూ పట్టుబడ్డారు. అందుకు తగిన ఆడియో, వీడియో రికార్డులను ఏసీబీ బయటపెట్టింది.