“న్యాయం” అనేది ప్రతి భారతీయ పౌరుడి హక్కు అని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. నేటి ఆర్థిక విధానాలు రేపటి శక్తివంతమైన భారత్ (India)కు పునాదులు వేస్తాయని చెప్పారు. నేడు రూపొందించబడుతున్న చట్టాలు భారత ఉజ్వల భవిష్యత్తును బలోపేతం చేస్తాయని తెలిపారు. విశ్వసనీయ న్యాయ వ్యవస్థ కోసం తమ ప్రభుత్వం నిరంతరం పని చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ…. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉత్తమ అభ్యాసాలకు అనుగుణంగా దేశంలోని చట్టాలను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. వలస పాలన కాలం నాటి చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో మూడు కొత్త చట్టాలను తీసుకు వస్తున్నామని చెప్పారు.
ఈ మూడు నేరచట్టాల వల్ల దేశంలోని న్యాయ, పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు కొత్త దశలోకి ప్రవేశించాయని అన్నారు. ఇప్పుడు ప్రపంచం దృష్టంతా భారత్ పైనే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ పై విశ్వాసం పెరుగుతోంది. న్యాయానికి ప్రతి పౌరుడు అర్హుడన్నారు. ప్రతి పౌరుడికి సులభంగా న్యాయం అందేలా చేయడమే భారత లక్ష్యమన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న చట్టాలు భారత్ భవిష్యత్తును మరింత ప్రకాశ వంతం చేస్తాయని వివరించారు.
వికసిత్ భారత్లో సాధికార న్యాయ వ్యవస్థ కూడా ఒక భాగమన్నారు. దేశంలో విశ్వసనీయ న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. ఈ దిశలో జన్ విశ్వాస్ బిల్లు ఒక అడుగని పేర్కొన్నారు. భవిష్యత్తులో న్యాయవ్యవస్థపై అనవసరమైన భారాన్ని ఈ బిల్లు పూర్తిగా తగ్గిస్తుందన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ఆసియాలో సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీబీని పద్మభూషన్తో సత్కరించామన్నారు. ఇది దేశమంతా గర్వపడాల్సిన విషయమని వివరించారు.