పిల్లి కళ్ళు మూసుకుని పాలుతాగుతూ తనని ఎవరు చూడటం లేదని భావిస్తుంది. అలాగే రాజకీయనేతలు కూడా వివిధ మార్గాలలో పార్టీ ఫండ్ సేకరించుకుంటూ ఇంత కాలం గడిపారని అనుకుంటున్నారు.. కానీ ఆ పప్పులు ఉడకనీయకుండా చేయడానికి ఎలక్షన్ కమిషన్ (Election Commission) రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్ల (Electoral bonds) ద్వారా పార్టీలకు అందుతున్న విరాళాల వివరాలన్నీ గోప్యంగానే ఉండిపోయాయి.
తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ (Association of Democrats) రిఫామ్స్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అనంతరం ఎలక్షన్ కమిషన్ ను రంగంలోకి దిగాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఈసీ.. ఈ నెల 3న దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు అందిన డోనర్ల వివరాలను, వారు విరాళంగా ఇచ్చిన మొత్తాన్ని సీల్డ్ కవర్లో సమర్పించాలంటూ లేఖలు రాసింది.
పూర్తి వివరాలను నవంబరు 15వ తేదీ వరకు అందజేయాలని ఆదేశించింది. ఈ వివరాలు లీక్ కాకుండా ఉండేందుకు డబుల్ సీల్డ్ కవర్లో సమర్పించాలన్న ఈసీ.. కవర్ మీద కాన్ఫిడెన్షియల్ –ఎలక్టోరల్ బాండ్ అని పేర్కొనాలని వెల్లడించింది. మరోవైపు ఎవరి నుంచి ఏ పార్టీకి ఎంత అందిందనేది ఈసీ నిర్ణయంతో వెలుగులోకి రానున్నదని తెలుస్తుంది. ఇదే జరిగితే ఏ పార్టీ అకౌంట్ లో ఎంత జమైందో అనే విషయాలు పబ్లిక్కు తెలిసేలా బహిర్గతమవుతాయనే చర్చ సాగుతుంది.