లోక్‌సభ ఎన్నికల వేళ ఈవీఎం(EVM)లలో ఓట్లతో పాటు వీవీప్యాట్ల స్లిప్‌లను కూడా లెక్కించాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ల(Paper Ballet)ను వాడాలన్న అభ్యర్థనను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్‌లను వంద శాతం సరిచూసుకోవాలని చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లతో వంద శాతం క్రాస్ వెరిఫికేషన్ కుదరదని కోర్టు తెలిపింది.
వీవీప్యాట్ల ఫిజికల్ డిపాజిట్ కూడా కుదరదు అని కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 24న వాదనల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం లేదని పేర్కొంటూ రిజర్వ్ చేసిన తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ప్రొటోకాల్స్, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం.. ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది.
అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక, కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్‌లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్‌ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఈసీకి తెలిపారు.