ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) సతీమరణి సునేత్ర పవార్ (Sunetra Pawar)పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బారామతి నియోజక వర్గంలో సుప్రియా సూలేకు వ్యతిరేకంగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సుప్రియా సూలే స్పందించారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని సుప్రియా సూలే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపారు. అలాంటప్పుడు ఇది ఫ్యామిలీ ఫైట్ ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ఆ పార్టీకి బలమైన అభ్యర్థి ఉంటే వారితో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్బంగా వెల్లడించారు.
వారు ఏ అంశం.. ఏ సమయంలోనైనా.. ఏ ప్రదేశంలో నిర్ణయించినా కూర్చుని వారితో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేటీఎం అంశం, ఎలక్టోరల్ బాండ్లు ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు.. అవినీతికి పాల్పడిన వారందరూ… దోషులుగా తేలితే… వారంతా బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు.
దేశంలో అవినీతి జరిగిందా లేదా.. ఇదే పెద్ద సమస్య అని అన్నారు. సుప్రియా సూలే ప్రస్తుతం బారామతి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి చాలా సార్లు శరద్ పవార్ ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో పవార్ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు అజిత్ పవార్ సతీమణి రంగంలోకి దిగుతున్నారని వార్తలు ఊపందుకున్నాయి.