నిత్యం ప్రకృతి పరీక్షలతో సతమతం అయ్యే రైతన్న కన్నీళ్ళు ఎప్పటికీ తడి ఆరని సెలయేళ్లని అంటారు.. ప్రపంచం అంతా హాయిగా నిదురిస్తే.. రైతు మాత్రం తన పంటపొలం గురించి ఆలోచిస్తూ ఉంటాడని తెలిసిందే.. ఇక ప్రస్తుత కాలంలో వ్యవసాయం అంటే గుండెల్లో దడ పుడుతుంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి సరిగ్గా రాక, చేసిన అప్పులు తీరక దిక్కుతోచని దీనావస్థలోకి వెళ్తున్న రైతన్నకు మరో షాక్ తగిలింది.
సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల (Munagala) మండల కేంద్రం హెడ్‌క్వార్టర్ శివారులో ఊహించని సంఘటన జరిగింది. సాగర్ ఎడమ కాల్వ (Sagar Left Canal)పై నిర్మించిన బేతవోలు వరద కాల్వకు ఉన్న ఎస్కేప్ గేట్ ఆదివారం రాత్రి ఒక్క సారిగా ఊడిపోయింది. దీంతో దిగువ ప్రాంతాల్లోకి సాగర్ ఎడమ కాల్వ నీరు ఉద్ధృతంగా ప్రవహించింది.
ఈ ప్రవాహంతో చిలుకూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో కోతకు వచ్చిన వందల ఎకరాల పంట నీట మునిగింది. కోత కోసి పొలాల్లో ఉంచిన మెదలు సైతం తడిసిపోవడంతో, రైతుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. సుమారు 1000 ఎకరాల్లోకి సాగర్ నీరు చేరి వరిపైరును ముంచింది.. మునిగిన పొలాలను చూసిన రైతులు ఇదంతా తమ దురదృష్టమని కన్నీరుపెట్టడం కలచివేస్తుంది.
తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. ఇప్పటికే రెగ్యులేటింగ్ గేట్ తుప్పు పట్టి ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పినా వినిపించుకోని ఎన్ఎస్పీ అధికారులు.. ఖమ్మంలోని పాలేరు చెరువు నింపేందుకు నీటిని విడుదల చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే పంట నష్టం సంభవించేది కాదని రైతులు చెబుతున్నారు.