మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఆ పథకం వల్ల ఆటో డ్రైవర్లు తమ జీవన భృతిని కోల్పోతున్నారంటూ బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతుండగా, అదంతా బీఆర్ఎస్ డ్రామా అంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆటోలో కేటీఆర్ కూర్చున్న ఫోటోను షేర్ చేసింది. ఆటో రాముడు…. డ్రామాలు మానడు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. ప్రజలను రెచ్చ గొట్టి తమ పబ్బం గడుపుకోవడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అంటూ నిప్పులు చెరిగింది. దీనిపై ‘ఆటో రామడు…. డ్రామాలు బోలెడు’అంటూ మరికొందరు రీ ట్వీట్ చేస్తున్నారు.
ఎన్నికల హామీల అమలులో భాగంగా పెరిగిన ధరల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు, మహిళలకు సాధికారత కల్పించేందుకు, నష్టాల్లో కూరుకు పోయిన ఆర్టీసీని రక్షించేందుకు ‘మహాలక్ష్మీ’పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని వివరించింది.
ఆటో డ్రైవర్ల సమస్యలను కాంగ్రెస్ ముందుగానే గుర్తించిందని, అందుకే ఏడాదికి రూ. 12 వేలు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని గుర్తు చేసింది. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోందని తెలిపింది. ప్రతిపక్ష పార్టీగా తగిన సూచలు ఇవ్వాల్సిన బీఆర్ఎస్ అలా చేయకుండా…ఆటో డ్రైవర్లు తమ ఆటోలను కాల్చి వేసేలా ప్రోత్సహిస్తూ వారి ఆత్మహత్యల వైపు పురికొల్పుతోందని ఆరోపించింది.
అధికారంలో ఉన్న పదేండ్లు భోగ భాగ్యాలు అనుభవిస్తూ ప్రజలకు దూరంగా ఉన్న డ్రామారావు ఇప్పుడు ఆటో రాముడిగా మారి సరికొత్త డ్రామాకు తెరలేపారని ఫైర్ అయ్యింది. కేటీఆర్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని.. అందుకే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన బుద్ది చెప్పారని… ఇప్పటికైన ప్రతిపక్ష హోదాలోనైనా హుందాగా వ్యవహరించి, ప్రభుత్వానికి సరైన సూచనలు చేయండని హితవు పలికింది.