Telugu News » BC Declaration: బీసీ రిజర్వేషన్లను పెంచుతాం…బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్….!

BC Declaration: బీసీ రిజర్వేషన్లను పెంచుతాం…బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్….!

ఆ జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్ల (BC Reservations)ను పెంచుతామని తెలిపింది.

by Ramu

– బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్
– రిజర్వేషన్ పెంచుతామని హామీ
– కామారెడ్డిలో రేవంత్ నామినేషన్
– భారీ బహిరంగ సభ.. హాజరైన కర్ణాటక సీఎం
– దేశ ప్రజలంతా కామారెడ్డి వైపు చూస్తున్నారు
– కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం
– గజ్వేల్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారు
– నేతల కొనుగోళ్లపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమా?
– కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

ఓటర్లపై కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా మరో కీలక హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కులగణన నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను పెంచుతామని తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచుతామని వెల్లడించింది.

రేవంత్ రెడ్డి నామినేషన్ అనంతరం.. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభను కాంగ్రెస్ నిర్వహించింది. బీసీ-డీలో ఉన్న ముదిరాజులను బీసీ-ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చింది. 50 ఏండ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. బీసీలకు సబ్ ప్లాన్ ప్రవేశ పెడుతామని.. వైన్ షాపులో గౌడ్స్‌ కు రిజర్వేషన్లను 15 నుంచి 25 శాతానికి పెంచుతామని చెప్పింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మెగా పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. రాబోయే ఐదేండ్లలో బీసీల అభివృద్ధి కోసం లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని వరాల జల్లు కురిపించింది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ ను కామారెడ్డి నిర్ణయించబోతుందని అన్నారు. కేసీఆర్ పాలనకు కామారెడ్డి చరమగీతం పాడబోతోందని, ఇక్కడి తీర్పు కోసం యావత్ దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సీఎం ఏ రోజూ సచివాలయానికి రాలేదని ధ్వజమెత్తారు. కామారెడ్డికి చెందిన రైతు లింబయ్య సచివాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు ధాన్యంపైనే గుండె ఆగి చనిపోయాడన్నారు.

గజ్వేల్ వాసులను పదేళ్లపాటు మోసం చేసిన కేసీఆర్‌ కు ఇవాళ కామారెడ్డి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కామారెడ్డి భూములపై సీఎం కేసీఆర్ కన్ను పడిందని, అందుకే ఆయన ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌ ను బంగారు తునక చేసి ఉంటే.. అక్కడి నుండి పారిపోయి కామారెడ్డికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను కేసీఆర్ నట్టేట ముంచారని ఫైర్ అయ్యారు. గంప గోవర్ధన్ కామారెడ్డి వచ్చి పోటీ చేయాలని కోరారని కేసీఆర్ చెబుతున్నారని, ఆయనకు పోటీ చేసేందుకు సిరిసిల్ల, సిద్దిపేట లేదా.. బీసీ నేత అయిన గంప గోవర్ధన్ సీటే కావాలా అని ప్రశ్నించారు.

రైతు రుణమాఫీ జరగలేదు, పండించిన పంట కొనే దిక్కు లేదు.. కానీ కేసీఆర్‌ ను మూడోసారి గెలిపించాలంట అని సీరియస్ అయ్యారు. దమ్ముంటే ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమవ్వాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. తాను రూ.50 లక్షలు పెట్టి ఎమ్మెల్యేను కొనడానికి వెళ్లానని కేసీఆర్ అన్నారని.. నిజానికి 40 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్సీలు, వేలాది మంది ఇతర పార్టీల నుంచి గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసింది ఈయన కాదా అని అడిగారు. తాను డబ్బులిచ్చి ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే.. మరి కేసీఆర్ ఎన్ని వందల కోట్లు ఇచ్చి వీరిని కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment