గవర్నర్(Governor) హోదాలో మేడారం సమ్మక్క సారలమ్మలను మూడు సార్లు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నానని గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) తెలిపారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, మంత్రులు, సీతక్క, శ్రీధర్ బాబులతో కలిసి సమ్మక్క, సారలమ్మలను శుక్రవారం ఆమె దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, గిరిజనులు ఐక్యంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నట్లు తలిపారు. గవర్నర్ హోదాలో ఇప్పటి వరకు మేడారం మూడు సార్లు సందర్శించి అమ్మవార్లను దర్శించి మొక్కులు అప్పచెప్పడం అదృష్టంగా భావిస్తున్నట్లు తమిళిసై మనసులో మాటను చెప్పారు.
గిరిజనులను అభివృద్ధి చేయాలనే తనకున్న బలమైన కోరికతో ఇక్కడి ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. అదేవిధంగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారమని అన్నారు. ఆదివాసీ గిరిజనులు తెలంగాణతో పాటు చత్తీస్గఢ్ రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువగా ఉంటారని తెలిపారు.
రెండు రాష్ట్రాల ఆదివాసులకు మేడారం వరమని ఆయన అన్నారు. మేడారాన్ని ట్రైబల్ ఫెస్టివల్ జాతరగా జరిపేందుకు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారితో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఉన్నారు.