Tamilnadu : 2024 ఎన్నికలకు తమిళనాడులో బీజేపీ అన్ని హంగులతో సమాయత్తమవుతోంది. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆధ్వర్యాన.. రాష్ట్రంలో సాగుతున్న పాదయాత్ర శుక్రవారం 20 వ రోజుకు చేరుకుంది. ‘మై ల్యాండ్,.. మై పీపుల్’ పేరిట సాగుతున్న పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జులై 28 న రామనాథపురం నుంచి దీన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ఇలాంటి కార్యక్రమాలను చేబట్టింది.
ఈ పాదయాత్రలో ప్రధాని మోడీ విగ్రహాన్ని మోసుకుంటూ , వెనుక ఆయన ప్రసంగాలతో కూడిన ఆడియో క్యాసెట్లతో కార్యకర్తలు సాగుతున్నారు. ఈ డీఎంకే పాలిత రాష్ట్రంలో యాత్ర ఎక్కడ ఆగుతున్నా.. ప్రజలు ఉత్సాహంగా తామూ భాగస్వాములేనన్నట్టు పదం కదుపుతున్నారు. మధ్యమధ్య పార్టీ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రభుత్వం అనినీతిలో కూరుకుపోయిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
పార్టీ పాదయాత్రను చూసి ప్రభావితుడైన కార్తిక్ అనే కానిస్టేబుల్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రాజకీయ ప్రయాణంలో తానూ భాగస్వామినవుతానని చెప్పాడు. లోగడ కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై ఇతని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2019 లో తన పదవికి రాజీనామా చేసిన ఆయన 2020 లో బీజేపీలో చేరారు.
నీట్ బిల్లును వ్యతిరేకిస్తున్న సీఎం స్టాలిన్ ప్రభుత్వాన్ని అన్నామలై పలు సందర్భాల్లో దుయ్యబట్టారు. ఈ సమస్యపై రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య శత్రుత్వాన్ని రేకెత్తించేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కుటుంబ రాజకీయాలను ఈ ప్రభుత్వం ప్రోత్స హిస్తోందని విమర్శించారు. కాగా 6 నెలల ఈ పాదయాత్ర శుక్రవారం కన్యాకుమారి నాగర్ కోయిల్ ద్వారా సాగింది.