తమిళనాడు(Tamilnadu)లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తడంతో సుమారు 800మంది వరకు వరదల్లో(Floods) చిక్కుకున్నారు. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో కుండపోత వర్షాలు(Heavy rain) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. ఈ విపత్తు అక్కడి ప్రజలు కోలుకోలేని స్థితిలోకి నెట్టింది.
కొద్దిరోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం స్టేషన్‌లో ఓ రైలు వరదల్లో చిక్కుకుపోయింది. ఈ రైలులో దాదాపు 809 మంది ప్రయాణిస్తున్నారు. రైలులో చిక్కుకున్న ప్రయాణికులను ఖాళీ చేయించడం అతిపెద్ద సవాలుగా మారింది. సోమవారం, రెస్క్యూ టీమ్ రైలు నుంచి 300 మందిని సురక్షితంగా బయటకు తీసి పాఠశాలలో ఉంచగా, మిగిలిన 509 మంది ప్రయాణికులను మంగళవారం తరలించారు.
రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులకు 48 గంటలు చాలా ఇబ్బందిగా మారింది. పోలీసులు, స్థానికులు ప్రయాణికులకు భోజన, పానీయాల ఏర్పాట్లు చేశారు. ఆర్‌పీఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ప్రయాణికులను సురక్షితంగా కాపాడటం వారికి పెద్ద సవాల్‌గా మారింది. వైమానిక దళానికి చెందిన మూడు హెలికాప్టర్లు ప్రయాణికుల కోసం ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పై నుంచి జారవిడిచాయి.
300 మంది ప్రయాణికుల్లో 270 మంది సమీప జిల్లాలకు చెందిన వారేనని చెబుతున్నారు. 30 మంది ప్రయాణికులు ఇతర ప్రాంతాల వారిగా తెలుస్తోంది. మణియాచ్చి రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. రెస్క్యూ వర్కర్లు ఛాతీ లోతు నీటిలో దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు.
రెస్క్యూ వర్కర్లు ప్రయాణికులను నీటిని దాటేందుకు తాళ్లు అందించారు. వృద్ధులను స్ట్రెచర్లపై తీసుకెళ్లారు. రెస్క్యూ వర్కర్లు తమ చేతుల్లో చిన్న పిల్లలను ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టాలపై నీటిలో నడవడం ప్రతి ఒక్కరికీ చాలా కష్టంగా మారింది. ప్రయాణికులను చేతులు పట్టుకుని నీటిలో నుంచి బయటకు తీశారు.